godavari river: గోదావరి బోటు ప్రమాదం: రెండో రోజూ దొరకని గల్లంతైనవారి ఆచూకీ!
- సహాయక చర్యల్లో 600 మంది
- బోటు 315 అడుగుల లోతులో ఉన్నట్టు అంచనా
- ప్రతికూల వాతావరణంతో వెనుదిరిగిన నేవీ హెలికాప్టర్లు
గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన వారి జాడ రెండో రోజు కూడా దొరకలేదు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మృతదేహాలు లభ్యం కాగా, 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన 38 మంది కోసం గోదావరిని జల్లెడ పడుతున్నారు. నిన్న ప్రత్యేక బృందాలతో గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మరోవైపు, ప్రతికూల వాతావరణం గాలింపు చర్యలను అడ్డుకుంటోంది. నిన్న ఉదయం ఆరు గంటల నుంచే గాలింపు చర్యలు మొదలయ్యాయి. నౌకాదళ హెలికాప్టర్లు కూడా వచ్చినప్పటికీ వర్షం కారణంగా వెనుదిరిగాయి. ఇక, మొత్తం 80 మంది సిబ్బంది ఆరు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఏడుగురు నేవీ డైవర్లు, 80 కంట్రీబోట్లతో గాలింపు ముమ్మరం చేశారు. నీటి అడుగుకు చేరుకోగల నైపుణ్యం ఉన్నవారు కూడా గాలింపు చర్యల్లో పాలుపంచుకున్నారు. సైడ్ స్కాన్ సోనార్ పరికరంతో డీప్ డైవర్లు బోటును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా 600 మంది సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. ప్రమాదానికి గురైన బోటు 315 అడుగుల లోతున ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో డెహ్రాడూన్ నుంచి వచ్చిన 30 మందిని రంగంలోకి దించారు. వీరు నేడు సహాయక చర్యల్లో పాలు పంచుకోనున్నారు.