Tamil Nadu: 20 మందిపై అత్యాచారానికి పాల్పడిన నకిలీ ఎస్సైకి అరదండాలు

  • కాల్ సెంటర్ తెరిచి అత్యాచారాలు
  • తన సంస్థలో పనిచేస్తున్న యువతిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న వైనం
  • నిందితుడిపై పలు రాష్ట్రాల్లో కేసులు

నకిలీ కాల్ సెంటర్ ప్రారంభించి అందులో పనిచేస్తున్న యువతులపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఏడుగురిని పెళ్లాడిన నకిలీ ఎస్సైకి చెన్నై పోలీసులు అరదండాలు వేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తిరుప్పూరు జిల్లా నొచ్చిపాళైయంకు చెందిన రాజేశ్ పృథ్వీ (29) చదివింది ఏడో తరగతే. కానీ తాను ఎస్సైనని అందరినీ నమ్మించాడు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పి అమైందకరైలో నకిలీ కాల్ సెంటర్ తెరిచాడు. అనంతరం అక్కడ 20 మంది మహిళలను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.  అతడి ఆఫీసులో పనిచేస్తున్న ఎగ్మూరుకు చెందిన యువతిని అపహరించి తీసుకెళ్లి ఏడో పెళ్లి చేసుకున్నాడు.

ఆఫీసుకు వెళ్లిన కుమార్తె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఆమె పనిచేస్తున్న సంస్థ ఎండీ పృథ్వీనేనని తేలింది. దీంతో అతడి సొంతూరు నొచ్చిపాళైయం వెళ్లిన పోలీసులు అక్కడ బందీగా ఉన్న యువతిని రక్షించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

రాజేశ్‌ ఇప్పటికే ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడని, అతడిపై తిరుచ్చి, కోయంబత్తూరు, తిరుప్పూరు, తిరుపతి, శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్టు తెలిపారు. తిరుపతిలో నమోదైన కేసులో జైలు శిక్ష కూడా పడింది. కోయంబత్తూరు కేసులో పోలీసుల కస్టడీ నుంచి పృథ్వీ పరారైనట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News