Jagan: ముఖ్యమంత్రి ముందే అధికారుల పరస్పర వాగ్వాదం... ఇదేం పనంటూ జగన్ ఆగ్రహం!
- గోదావరి ప్రమాదంపై పలు శాఖల అధికారులతో సీఎం సమీక్ష
- తప్పు తమది కాదంటే తమది కాదంటూ అధికారుల వాదనలు
- మరి బోటెలా కదిలిందంటూ జగన్ ఆగ్రహం
గోదావరిలో బోటు ప్రమాదం జరిగిన నేపథ్యంలో సీఎం జగన్, అధికారులతో సమీక్ష నిర్వహించిన వేళ, తప్పు మీదంటే, మీదంటూ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, వాగ్వాదానికి దిగారు. దీంతో జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోమవారం నాడు గోదావరి నదిపై ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం జగన్, అధికారులతో పరిస్థితిని, మృతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కాకినాడ పోర్టు అధికారులు, తాము బోటుకు ఫిట్ నెస్ సర్టిఫికెట్, లైసెన్స్ జారీ మాత్రమే చూసుకుంటామని చెప్పగా, పాపికొండల పర్యాటకానికి బోట్లు వెళ్లకుండా, వారం రోజుల నాడే అనుమతులు రద్దు చేశామని పర్యాటక శాఖ చెప్పింది. మరోవైపు ఇదే విషయంలో నీటి పారుదల శాఖ అధికారులు స్పందిస్తూ, తమ అధికారాలను కత్తిరించారని ఆరోపించారు.
ఇలా బోటు ప్రయాణానికి, ఆపై ప్రమాదానికి తాము కారణం కాదంటే, తాము కారణం కాదంటూ అధికారులు వాదులాడుకోగా, అసలు ఎవరూ అనుమతి ఇవ్వకుండా, బోటు ఎలా కదిలిందని జగన్ నిలదీశారు. బోట్లను ఎందుకు తనిఖీ చేయడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.