Andhra Pradesh: 144 సెక్షన్ ఎత్తివేయాలి.. మహానేత కోడెలకు వీడ్కోలు పలికే అవకాశం కల్పించాలి!: యనమల
- కోడెలది ఆత్మహత్యేనని ఫోరెన్సిక్ తేల్చింది
- ఆయన చావుకు వైసీపీ సర్కారు, సాక్షియే కారణం
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
ఫోరెన్సిక్ నివేదికలో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. కోడెల చావుకు వైసీపీ నేతలు, ప్రభుత్వం, పోలీసులు, సాక్షి మీడియానే కారణమని ఆరోపించారు. కోడెలను విదేశాల్లో ఉన్న కుమారుడే చంపాడని వైసీపీ నేతలు సాయితో ఫిర్యాదు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి వ్యాఖ్యలు, మంత్రి బొత్స వ్యాఖ్యలు ఒకేలా ఉన్నాయన్నారు. అమరావతిలో ఈరోజు మీడియాతో యనమల మాట్లాడారు.
37 ఏళ్ల రాజకీయ జీవితంలో కోడెల 27 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారని యనమల గుర్తుచేశారు. కోడెల ప్రాణాలను జగన్ ప్రభుత్వం, వైసీపీ నేతలే బలి తీసుకున్నారని స్పష్టం చేశారు. ఆయన మరణానికి వైసీపీ నేతలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నరసరావుపేటలో తక్షణం నిషేధాజ్ఞలను ఎత్తివేయాలని కోరారు. ఓ మహానేత పార్థివ దేహానికి ఆయన అనుచరులు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా వీడ్కోలు పలికే అవకాశం కల్పించాలనీ, అడ్డుపడొద్దని సూచించారు.