Andhra Pradesh: కోడెల కోరినప్పటికీ చంద్రబాబు 3 నెలలుగా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు!: గడికోట శ్రీకాంత్ రెడ్డి
- 2 వారాల క్రితం కోడెల నిద్రమాత్రలు మింగారు
- అయినా చంద్రబాబు పరామర్శించలేదు
- తెలుగుదేశం అధినేతపై ఘాటుగా స్పందించిన శ్రీకాంత్ రెడ్డి
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అడ్డగోలుగా వైసీపీపై బురద చల్లుతున్నారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అసలు చంద్రబాబులో సేవ చేసే గుణం ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బతికున్నవాళ్లను హింసిస్తారనీ, చనిపోయాక శవరాజకీయం చేస్తారని దుయ్యబట్టారు. చంద్రబాబు తనను ఎలా వేధించాడో దివంగత నేత ఎన్టీఆరే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. తాడేపల్లిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు.
టీడీపీ నేత హరికృష్ణ చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు శవరాజకీయం చేశారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గత మూడు నెలలుగా కలుస్తానని కోడెల కోరినప్పటికీ చంద్రబాబు ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. 2 వారాల క్రితమే కోడెల నిద్రమాత్రలు మింగినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారనీ, మరి చంద్రబాబు అప్పుడైనా ఆయన్ను పరామర్శించారా? అని నిలదీశారు. సత్తెనపల్లిలో కోడెల వ్యతిరేక వర్గాన్ని చంద్రబాబు ప్రోత్సహించారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం కోడెలను మానసికంగా ఇబ్బంది పెట్టిందన్నారు.
కోడెల ఆసుపత్రిలో ఉంటే చంద్రబాబు కనీసం పలకరించలేదనీ, ఆయన్ను సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారని గుర్తుచేశారు. టీడీపీ నేత వర్ల రామయ్యే కోడెలపై గతంలో తీవ్ర విమర్శలు చేశారన్నారు. పార్టీ సమావేశాలకు సైతం చంద్రబాబు కోడెలను ఆహ్వానించలేదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కోడెల క్యారెక్టర్ ను కించపర్చింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. శవయాత్రలు, శవరాజకీయాలు చేయడం చంద్రబాబు నైజమని స్పష్టం చేశారు. వైఎస్ రాజారెడ్డి, నారాయణరెడ్డిలను చంపిన హంతకులను ఇంట్లో పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుదని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.