Chalapathi Rao: బస్సు పై నుంచి పడిపోయాను .. ఒక దశలో చచ్చిపోవాలనిపించింది: సీనియర్ నటుడు చలపతిరావు
- బస్సు టాపుపై కూర్చున్నాను
- నాలుగు రోజులకి స్పృహ వచ్చింది
- కంటికి మూడు ఆపరేషన్లు జరిగాయన్న చలపతిరావు
తెలుగు తెరపై నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలతో పాటు, ఎన్నో విభిన్నమైన పాత్రల ద్వారా చలపతిరావు ప్రేక్షకులను మెప్పించారు. నటుడిగా సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అలాంటి చలపతిరావు తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకి జరిగిన ఒక ప్రమాదాన్ని గురించి ప్రస్తావించారు.
"అది భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమా .. ఒక సీన్లో ఒక పాత బస్సుపై కూర్చుని హీరో సునీల్ తోను .. హీరోయిన్ తోను కలిసి నేను ప్రయాణం చేయాలి. ఆ సీన్ పూర్తయిన తరువాత నేను బస్సు పై నుంచి దిగబోయాను. అంతే పట్టుతప్పి అక్కడి నుంచి పడిపోయాను. నాలుగో రోజున స్పృహ వచ్చేసరికి 'అపోలో హాస్పిటల్'లో వున్నాను. కాలు .. పక్క టెముకలు .. నడుము విరిగిపోయాయి. ఒక కన్ను చూపు సరిగ్గా లేకుండా పోయింది. మూడు ఆపరేషన్ల తరువాత సరిగ్గా చూపు వచ్చింది. ఏడెనిమిది నెలల పాటు కదలకుండా బెడ్ పైనే ఉండిపోయాను. ఒక దశలో చనిపోదామనిపించింది" అని చెప్పుకొచ్చారు.