Andhra Pradesh: చంద్రబాబు చేసిన అవమానంతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు!: ఏపీ మంత్రి కొడాలి నాని
- మేం కక్షసాధింపు చర్యలు చేపట్టలేదు
- చంద్రబాబు కోడెలకు అపాయింట్ మెంటే ఇవ్వలేదు
- దీంతో కోడెల మనస్తాపానికి లోనయ్యారు
తెలుగుదేశం నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెలపై తాము ఎలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కోడెల మరణానికి చంద్రబాబే పరోక్షంగా కారకులయ్యారని తేల్చిచెప్పారు. గత 10 రోజులుగా చంద్రబాబు కోడెలకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదని విమర్శించారు.
తాను నమ్మిన నాయకుడు, పార్టీ చేసిన అవమానంతోనే కోడెల ప్రాణాలు తీసుకున్నారని దుయ్యబట్టారు. నిన్న ఉదయం 9 గంటలకు చంద్రబాబుతో అపాయింట్ మెంట్ కోసం కోడెల ప్రయత్నించగా దొరకలేదనీ, దీంతో కోడెల తీవ్ర మనోవేదనకు లోనయ్యారని చెప్పారు. సచివాలయంలో ఈ రోజు కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని నాని స్పష్టం చేశారు. ఫర్నీచర్, బిల్డర్ల కేసులు తమ ప్రభుత్వం పెట్టలేదని నాని అన్నారు. ‘ఏ కేసులోనూ కోడెల, ఆయన కుమారుడు, కుమార్తెలకు మేం నోటీసులు ఇవ్వలేదు. ఆయన్ను చంద్రబాబే వదిలించుకునేలా వ్యవహరించారు. పార్టీ నుంచి దూరం పెట్టి అవమానించారు. అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో వర్ల రామయ్యతో విమర్శలు చేయించారు.
1999 బాంబుల కేసులో కోడెలపై విచారణ జరిపించి అవమానించింది చంద్రబాబు కాదా? ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించలేదా? ఇప్పుడు కోడెలను పల్నాటి పులి అంటున్న చంద్రబాబు, గతంలో కోడెలను పల్నాడుకు రాకుండా ఎందుకు అడ్డుకున్నారు. గతంలో నరసరావుపేట నుంచి కోడెలను సత్తెనపల్లికి పంపి అవమానించింది చంద్రబాబు కాదా?’ అని కొడాలి నాని నిలదీశారు.
కోడెలకు వ్యతిరేకంగా సత్తెనపల్లిలో ఓ వర్గాన్ని చంద్రబాబు తయారుచేశారని నాని ఆరోపించారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు కోడెల భౌతికకాయం వద్ద కూర్చుని మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. కోడెల ఆత్మహత్య చేసుకునేలా చంద్రబాబు ప్రేరేపించారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కోడెల కాల్ డేటాను విశ్లేషించాలనీ, ఇందులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.