Mamata Banarjee: ప్రధాని మోదీని కలుస్తున్న మమతా బెనర్జీ!
- గతకొంతకాలంగా మోదీతో సై అంటే సై అంటున్న దీదీ
- ఇవాళ మోదీని కలవాలని నిర్ణయం
- మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వైనం
ఎన్నికల సమయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. పరస్పరం ప్రత్యక్ష, పరోక్ష విమర్శలతో వాతావరణం వేడెక్కింది. ఇటీవలే చంద్రయాన్-2 ప్రయోగం సందర్భంగా కూడా దీదీ ప్రధానిపై విరుచుకుపడ్డారు. ఓవరాక్షన్ చేస్తున్నారంటూ విమర్శించారు.
అయితే, మోదీతో రేపు సాయంత్రం మమత భేటీ అవుతుండడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మోదీ రెండో దఫా ప్రధాని ప్రమాణస్వీకారానికి గైర్హాజరవడంతో పాటు, నీతి అయోగ్ భేటీకి డుమ్మా కొట్టిన మమత ఇప్పటికిప్పుడు మోదీకి బర్త్ డే విషెస్ తెలపడంతో పాటు ప్రత్యేకంగా కలవనుండడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై దీదీ స్వయంగా వివరణ ఇచ్చారు.
ప్రధానిని మర్యాదపూర్వకంగానే కలుస్తున్నానని, రాష్ట్రం పేరును మార్చే ప్రతిపాదన, పెండింగ్ నిధుల అంశం ప్రధానితో చర్చించనున్నానని ఆమె వెల్లడించారు. అయితే బీజేపీ వర్గాలు మాత్రం దీన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. సీబీఐ కేసులకు భయపడిన మమత స్వీయరక్షణ కోసమే మోదీని కలుస్తున్నారంటూ బీజేపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.