Kishan Reddy: యురేనియం విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి: కిషన్ రెడ్డి
- చర్చనీయాంశంగా మారిన యురేనియం తవ్వకాలు
- అనుమతులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనన్న కిషన్ రెడ్డి
- కేంద్రం తవ్వకాలను ఉపసంహరించుకోవాలంటూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం
నల్లమల అడవుల్లో అణుధార్మిక యురేనియం తవ్వకాలు వద్దంటూ ఇటీవల తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల మేరకే కేంద్ర ప్రభుత్వం యురేనియం లభ్యతపై పరిశోధనలు చేస్తోందని, అక్కడ జరుగుతున్నది తవ్వకాలు కాదని స్పష్టం చేశారు. యురేనియం విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. యురేనియం లభ్యతపై పరిశోధనల కోసం మూడేళ్ల కిందట అనుమతులు ఇచ్చింది నిజం కాదా? అంటూ టీఆర్ఎస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని తీర్మానిస్తూ కేసీఆర్ సర్కారు అసెంబ్లీలో ప్రకటన చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి స్పందించారు.