Andhra Pradesh: ఏపీ సుభిక్షంగా ఉండాలని విజయవాడలో చతుర్వేద పారాయణం
- టీటీడీ ఆధ్వర్యంలో మూడురోజుల కార్యక్రమం
- ప్రతి ఏడాది నిర్వహిస్తాం
- పంటలు బాగా పండి, లోకం సుభిక్షంగా ఉంటుంది: మంత్రి వెల్లంపల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తలపెట్టిన చతుర్వేద పారాయణం కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని బ్రాహ్మణ వీధిలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మూడురోజుల పాటు జరగనుంది.
ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, పరమపవిత్రమైన 18 పురాణములను శ్రవణం చేయడం ద్వారా లోకం సుభిక్షంగా ఉంటుందన్నారు. పంటలు బాగా పండి, లోకం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏడాది మూడు రోజులు పాటు చతుర్వేద పారాయణం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు, టీటీడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.