Pawan Kalyan: పవన్ కల్యాణ్ ముందు నాలుగు గంటలు కూర్చుని హీరోను చేయడం అవసరమా?: కాంగ్రెస్ నేతలపై సంపత్ కుమార్ ఫైర్
- యురేనియం తవ్వకాలకు, పవన్ కు సంబంధం ఏంటి?
- 130 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ నేతలు ఆయన ముందు కూర్చోవాలా?
- టీపీసీసీ సమావేశంలో వాడివేడి చర్చ
- ఇకపై ఇలా కానివ్వబోమన్న ఆర్సీ కుంతియా
పవన్ కల్యాణ్ ఓ సమావేశాన్ని నిర్వహిస్తే, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్, మాజీ ఎంపీ వీహెచ్ వంటి నాయకులు అక్కడకు వెళ్లి 4 గంటలు కూర్చోవడం ఏంటని ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్ కుమార్ నిప్పులు చెరిగారు. పవన్ కు, తెలంగాణలో యురేనియం తవ్వకాలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు.
పవన్ ముందు కూర్చుని, 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ బలంతో ఆయన్ను హీరోను చేయడం ఎందుకని అడిగారు. పవన్ సమావేశానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడంపై టీపీసీసీ సమావేశంలో వాడివేడిగా చర్చ సాగగా, సంపత్ మండిపడ్డారు. సంపత్ వ్యాఖ్యలను అడ్డుకున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ ఆర్సీ కుంతియా, ఇకపై ఇటువంటివి పునరావృతం కానివ్వబోమని అన్నారు. తవ్వకాలపై ఇప్పటికే ఢిల్లీలో ఉన్నతాధికారులను కలిసి, అభ్యంతరాలు వ్యక్తం చేశామని, సీఎంకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ లేఖ రాశారని అన్నారు.