Heavy Rain: తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టి... హైదరాబాద్ లో మూడు గంటల పాటు దంచికొట్టిన వాన!
- భారీ వర్షంతో తడిసి ముద్ద
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
నిన్నటి నుంచి, నేటి ఉదయం వరకూ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ముఖ్యంగా కర్నూలు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో గత రాత్రి 10 గంటల నుంచి రెండు గంటల వరకూ వర్షం పడుతూనే ఉంది.
ఖైరతాబాద్, నాంపల్లి, అమీర్ పేట, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్, లింగంపల్లి, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ ఉదయం పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోని నీటిని బయటకు తోడుకునేందుకు ప్రజలు నానా అవస్థలూ పడాల్సి వచ్చింది. వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది.