RTGS: రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలేనంటున్న ఆర్టీజీఎస్
- ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా వర్షాలు
- రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన
- రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరిక
బంగాళాఖాతంలో పశ్చిమమధ్య ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా గత రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఏపీలో మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని ఆర్టీజీఎస్ తెలిపింది. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
అదే సమయంలో తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని ఆర్టీజీఎస్ తాజా బులెటిన్ లో హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.