Godavari: 315 అడుగుల లోతులో బోటు... తీయడం తమవల్ల కాదంటున్న నేవీ!
- గోదావరిలో ఘోర ప్రమాదం
- నది అట్టడుగుకు చేరిన బోటు
- తమకు 150 అడుగుల వరకు అనుమతి ఉందంటున్న నేవీ!
గోదావరి పడవ ప్రమాదం అనంతరం భారత నేవీ సిబ్బంది సహాయ చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కాగా, ఈ ప్రమాదంలో మునిగిపోయిన బోటు గోదావరి నదిలో దాదాపు 315 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. కానీ ఆ బోటును వెలికి తీయడం తమ వల్ల కాదని భారత నేవీ వర్గాలంటున్నాయి. ఇలాంటి ఆపరేషన్లలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన నేవీ అధికారి దశరథ్ సైతం ఇది అసాధ్యం అంటూ తేల్చేయడంతో ఇక ఆ బోటు పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. గోదావరిలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తమకు 150 అడుగుల లోతు వరకు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉందని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.
గతంలో బలిమెల రిజర్వాయర్ లో భద్రతాబలగాల బోటు మునిగిపోగా, దాన్ని సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బయటికి తీసుకువచ్చారు. అయితే ఆ బోటు 70 అడుగుల లోతులోనే ఉండడంతో అది సాధ్యమైంది. కానీ, గోదావరి పరిస్థితుల్లో మరింత లోతుకు వెళ్లడం ఏమంత క్షేమకరం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.