secunerabad contomment: రక్షణ సిబ్బంది రోడ్డు మూసివేతపై కేటీఆర్ అసంతృప్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ
- ఆర్మీ తీరు అసాధారణంగా ఉందని ఆవేదన
- కంటోన్మెంట్ ప్రాంతంలో వాహనాల రాకపోకలను అనుమతించాలని విజ్ఞప్తి
- స్థానికుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని వినతి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇతర వాహనాలను అనుమతించకుండా రక్షణ దళాలు రోడ్డు బ్లాక్ చేయడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికుల అవసరాలు, సమస్యలను పట్టించుకోకుండా ఆర్మీ వర్గాలు అసాధారణంగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కేటీఆర్ లేఖ రాశారు.
సైన్యం తీరువల్ల స్థానికులు ఇబ్బందు ఎదుర్కొంటున్నారని, సమస్య పరిష్కరించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ ఏరియాలో సోమవారం వరకు వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చిన మిలటరీ అధికారులు నిన్న సాయంత్రం 5 గంటల నుంచి బొల్లారంలోని కేంద్రీయ విద్యాలయం దగ్గర్లో పూరీసింగ్ మార్గ్‌ను మూసేశారు. వాహనాలను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
రోడ్డు మూసివేసిన విషయాన్ని స్థానికులు ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకూ ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డులను చూపిస్తే వాహనాలు వెళ్లేందుకు అనుమతిచ్చే వారని, ఇప్పుడు అకస్మాత్తుగా రోడ్లను ఎందుకు మూసేశారో తెలీదని స్థానికులు వాపోయారు. దీనివల్ల తాము 8 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని వివరించారు.
గత జూన్‌లో కొత్త గేటు ఏర్పాటు చేస్తున్నామనే కారణంతో రక్షణ సిబ్బంది రోడ్డును మూసేశారు. దీంతో మూడు రోజులపాటు స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. మళ్లీ తాజాగా అదే పరిస్థితి ఏర్పడడంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రజల ఫిర్యాదును సీరియస్ గా పరిగణించిన కేటీఆర్ ఏకంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కే లేఖ రాయడం గమనార్హం.