East Godavari: 300 అడుగుల లోతులో ఉన్న బోటును బయటకు తీయడం కష్టం: మంత్రి పినిపే విశ్వరూప్
- ఇంకా 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది
- చివరి వ్యక్తి ఆచూకీ తెలిసే వరకూ గాలింపు చర్యలు
- మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలిస్తాం
తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన బోటు ప్రమాద ఘటనకు సంబంధించిన తాజా వివరాలను మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని, చివరి వ్యక్తి ఆచూకీ తెలిసే వరకూ గాలింపు చర్యలు కొనసాగిస్తామని అన్నారు.
అయితే, మూడు వందల అడుగుల లోతులో ఉన్న బోటును బయటకు తీయడం కష్టమని అభిప్రాయపడ్డారు. ముంబై నుంచి ఓ టీమ్ ఇక్కడికి వచ్చిందని, యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని మళ్లీ మూడురోజుల్లో వస్తామని చెప్పిందని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా జిల్లా యంత్రాంగం ఇక్కడే ఉందని చెప్పారు. లభ్యమైన మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని, వారి స్వగ్రామాలకు తరలిస్తామని చెప్పారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులను మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు పరామర్శించారు. ప్రభుత్వం ద్వారా సహాయసహకారాలు అందిస్తామని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.