Saudi Arabia: డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల శకలాలను ప్రదర్శించిన సౌదీ.. దాడుల వెనుక ఇరాన్ హస్తంపై ఆగ్రహం!
- సౌదీలోని ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా దాడులు
- దాదాపు 25 డ్రోన్లు, మిస్సైళ్ల ప్రయోగం
- ఈ దాడులను ఇరాన్ స్పాన్సర్ చేసిందని ఆరోపించిన సౌదీ
ఈ నెల 14న సౌదీ అరేబియాపై క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ అయిన అమ్ ఖైక్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. దాదాపు 25 డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించారు. అయితే, లక్ష్యానికి కొంచెం దూరంలో ఇవి పడటంతో, పెను విధ్వంసం తృటిలో తప్పింది. ఈ నేపథ్యంలో, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల శకలాలను సౌదీ అరేబియా ప్రదర్శించింది. ఈ దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా సౌదీ అరేబియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ తుర్కీ అల్ మల్కి మాట్లాడుతూ, ఇరాన్ కు చెందిన మానవ రహిత 'డెల్టా వింగ్ ఏరియల్ వెహికల్స్' కూడా ఈ దాడుల్లో పాల్గొన్నాయని చెప్పారు. 'యా అలీ' క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించారని తెలిపారు. ఉత్తర దిక్కు నుంచి ఈ దాడులు జరిగాయని... ఈ దాడులను ఇరాన్ స్పాన్సర్ చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం మీ ముందు ఉన్న శకలాలను చూస్తే... దీని వెనుక ఇరాన్ హస్తం ఉందనే విషయాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు.
మిస్సైల్స్ ను కచ్చితంగా ఏ పాయింట్ నుంచి ప్రయోగించారనే విషయాన్ని తేల్చే పనిలో ఉన్నామని మల్కి తెలిపారు. ఈ దాడులు సౌదీ అరేబియా దక్షిణాన ఉన్న యెమెన్ నుంచి జరగలేదని చెప్పారు. మిస్సైల్ టార్గెటింగ్ డైరెక్షన్ ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా ఉందని తెలిపారు.
మరోవైపు, ఈ దాడుల వెనక తమ హస్తం ఉందనే ఆరోపణలను ఇరాన్ ఖండించింది. సౌదీ అరేబియాకు ఈ దాడులపై అవగాహన లేదనే విషయం వారి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అర్థమవుతోందని ఇరాన్ అధ్యక్షుడి సలహాదారుడు ట్వీట్ చేశారు.