India: ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించిన న్యూయార్క్ మాజీ మేయర్!
- నిన్న ఈ-సిగరెట్లపై నిషేధం విధించిన భారత్
- ప్రధాని మోదీ నిర్ణయంపై మైక్ బ్లూమ్ బర్గ్ హర్షం
- మోదీ ప్రజల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇచ్చారని కితాబు
ఈ-సిగరెట్లపై భారత ప్రభుత్వం నిన్న నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సాధారణ సిగరెట్ల కంటే ఇవి మరింత ప్రమాదకరం కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ-సిగరెట్ల నిషేధం విషయంలో ప్రధాని మోదీ తీసుకున్న చొరవపై న్యూయార్క్ కు 3 సార్లు మేయర్ గా పనిచేసిన మైక్ బ్లూమ్ బర్గ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ-సిగరెట్లపై నిషేధం విధించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
‘థాంక్యూ పీఎం మోదీ.. మీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఈ-సిగరెట్లపై నిషేధం విధించింది. ఈ ప్రమాదకరమైన అంటువ్యాధిని ముందే గుర్తించిన మీరు.. భారత ప్రజల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇచ్చారు’ అని కితాబిచ్చారు. అమెరికాలోని న్యూయార్క్, మిషిగన్ రాష్ట్రాలు ఇప్పటికే ఈ-సిగరెట్ల వాడకం, అమ్మకం, తయారీ, ఎగుమతి-దిగుమతిపై నిషేధం విధించాయి.