Kodela siva prasad: కోడెల ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్
- టీ-హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అనిల్ బూరగడ్డ
- కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదు
- కోడెల మృతి వెనుక ఎవరు ఉన్నారో తేలాలి?
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోడెల మృతి ఘటనపై అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తూ అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అనిల్ ని పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, మంచి నేతగా నిరూపించుకున్న వ్యక్తి కోడెల అని అన్నారు.
గతంలో కోడెల నివాసంలో బాంబులు పేలిన సందర్భంలో సీబీఐ విచారణ కోరినప్పుడు కూడా కోడెల భయపడలేదని గుర్తుచేశారు. ఒక డాక్టరు అయిన కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని అన్నారు. కోడెల మృతికి సంబంధించి మిస్టరీ నడిచిందని, దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలని అన్నారు. కోడెల ఆత్మహత్య వెనుక చంద్రబాబు రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ ఘటన వెనుక కోడెల తనయుడు శివరామ్ కు సంబంధం ఉందని, సీబీఐతో విచారణ జరిగితేనే నిజాలు బయటకు వస్తాయని అన్నారు. కోడెల మృతి ఘటనకు సంబంధించి ఆయన గన్ మ్యాన్, పీఏను విచారించాలని కోరారు.