Kodela: చంద్రబాబులో అలాంటి భావోద్వేగాలే కనిపించలేదు... కోడెలలో చెడు కోణాన్ని చెప్పాల్సిన దుస్థితి తీసుకొచ్చారు: అంబటి ఫైర్
- కోడెల ఆత్మహత్యా యత్నం చేసినప్పుడు బాబు పట్టించుకోలేదన్న అంబటి
- వేల కోట్లు దోచుకున్నారనడం సరికాదని హితవు
- దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. కోడెలలో చెడు కోణాన్ని చెప్పాల్సిన దుస్థితి తీసుకువచ్చింది చంద్రబాబేనని మండిపడ్డారు. సహచరులు చనిపోయినప్పుడు భావోద్వేగాలు సహజమని, కానీ చంద్రబాబులో ఎక్కడా భావోద్వేగం కనిపించలేదని అంబటి వ్యాఖ్యానించారు. కోడెల ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు.
లక్ష రూపాయల ఫర్నిచర్ కోసం వేల కోట్లు దోచుకున్నవాళ్లు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించడం సరికాదని అంబటి హితవు పలికారు. కేసులు ఉన్నంతమాత్రాన వేల కోట్లు కాజేసినట్టేనా అని ప్రశ్నించారు. అక్రమ కేసులు భరించలేకే కోడెల చనిపోయినట్టు బాబు చెబుతున్నారని, ఇది తప్పుడు విధానం అని అన్నారు. ఫిర్యాదు అందినప్పుడు కేసు నమోదు చేయడం పోలీసుల ధర్మం అని, కేసులు నమోదయ్యాయే తప్ప దర్యాప్తు జరుగుతుండడం వల్ల ఇంకా చర్యలు తీసుకోలేదని అంబటి స్పష్టం చేశారు.