TS RTC: ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు.. 23 నుంచి టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె

  • ఆర్టీసీపై ‘పిచ్చికుక్క’ ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది
  • ఆర్టీసీ లాభాల్లోనే ఉంది
  • డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమం ఉద్ధృతం

బతుకమ్మ, దసరా పండుగలకు ఊరెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న తెలంగాణ ప్రజలకు ఇక్కట్లు తప్పేలా కనిపించడం లేదు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఈ నెల 23 నుంచి సమ్మెకు వెళ్లనున్నారు. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ యాజమాన్యానికి నిన్న సమ్మె నోటీసులు అందించినట్టు తెలిపారు.  

ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్టు.. తెలంగాణలోనూ ఆర్టీసీని విలీనం చేయాలని డిమాండ్ చేశారు. నష్టాల పేరుతో ఆర్టీసీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారని, నిజానికి సంస్థ నష్టాల్లో లేదని అన్నారు. ఆర్టీసీపై ‘పిచ్చికుక్క’ ముద్రవేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మంత్రివర్గ ఉప సంఘం సూచించిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని అన్నారు.

23,24 తేదీల్లో డిపోల ముందు ధర్నాలు చేస్తామని పేర్కొన్న అశ్వత్థామరెడ్డి లాభనష్టాలతో సంబంధం లేకుండా ఆర్టీసీని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డి హెచ్చరించారు.  

  • Loading...

More Telugu News