Rains: ఈ వారమంతా భారీ నుంచి అతి భారీ వర్షాలు: హెచ్చరించిన వాతావరణ శాఖ
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- అదనంగా ఉపరితల ఆవర్తన ద్రోణి
- కుంభవృష్టికి చాన్స్ ఉందన్న వాతావరణ శాఖ
వచ్చే నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి, ఉపరితల ఆవర్తనం కూడా తోడు కావడంతో వర్షాలు కురవనున్నాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
రాయలసీమ సహా, కోస్తా, తెలంగాణలపై ఈ ప్రభావం ఉంటుందని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అన్నారు. నేటి (సోమవారం) సాయంత్రం నుంచి మంగళవారం వరకూ రాయలసీమ ప్రాంతంలో కుంభవృష్టికి అవకాశాలు ఉన్నాయని, గంటల వ్యవధిలో సెంటీమీటర్ల వర్షం పడుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరం ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఈ ఉపరితల ఆవర్తనం ఉందని, దీని ప్రభావం ఈ వారమంతా కొనసాగుతుందని హెచ్చరించారు.