mudragada: ముద్రగడగారూ... చేతనైతే బయటకు వచ్చి ఉద్యమం చేయండి: చినరాజప్ప సవాల్
- కేసులు పెడతారని భయపడుతున్నారా?
- చంద్రబాబుకు లేఖలు రాస్తే ప్రయోజనం ఏమిటి?
- అయినా మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని ఎద్దేవా
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విపక్షనేత చంద్రబాబుకు లేఖ రాయడంపై ఏపీ మాజీ హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. ఈ రోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేసులకు భయపడి ముద్రగడ తన ఉద్యమాన్ని పక్కన పెట్టేశారని, లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయినా ఆయననుగాని, ఆయన లేఖలను గాని ఎవరు పట్టించుకుంటారని వ్యంగ్యంగా అన్నారు.
ముద్రగడకు చేతనైతే బయటకు వచ్చి ఉద్యమాలు చేయాలని సవాలు విసిరారు. టీటీడీ పాలకమండలిపై మాట్లాడుతూ అదో జంబోజెట్లా ఉందన్నారు. పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం పాలక మండలిలో నేరచరిత్ర ఉన్న వారికి అవకాశం ఇచ్చారని విమర్శించారు. పైగా ఏపీ కంటే ఇతర రాష్ట్రాల వారే అధికంగా ఉండడం మరీ విడ్డూరమన్నారు. ఇక పోలవరం ఎత్తు తగ్గించేందుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించారంటే ఎన్నికల వేళ కేసీఆర్ చేసిన ధన సహాయానికి జగన్ రుణం తీర్చుకుంటున్నారని తేటతెల్లమయ్యిందన్నారు.