Vijay Sai Reddy: విజయసాయిరెడ్డిపై సుమోటోగా కేసు రిజిస్టర్ చేయాలి: వర్ల రామయ్య డిమాండ్
- 90 శాతం మనవాళ్లకే ఇచ్చాం అంటూ విజయసాయి వ్యాఖ్యలు
- నియామకాల్లో అవకతవకలకు ఇదే నిదర్శనం అంటున్న టీడీపీ
- నియామకాలు రద్దు చేయాలన్న వర్ల రామయ్య
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో అధికశాతం మనవాళ్లకే ఇచ్చాం, వలంటీర్ నియామకాల్లో 90 శాతం మనవాళ్లకే ఇచ్చాం అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం పట్ల టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ముఖ్యుడైన ఆయనే ఈ విషయాలు స్వయంగా వెల్లడించినప్పుడు నియామకాల్లో అవకతవకలు జరిగినట్టే కదా అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు. ఈ నియామకాలు రద్దు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.