Devineni Uma: తమ వాళ్లకు కట్టబెట్టేందుకే జగన్ రివర్స్ టెండరింగ్ నిర్వహించారు: దేవినేని ఉమ
- పోలవరం రివర్స్ టెండరింగ్ పై ఉమ ప్రెస్ మీట్
- ఆదా చేస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శలు
- టీడీపీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పనులపై ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలవరం పనులను తమ వాళ్లకు కట్టబెట్టేందుకే రివర్స్ టెండరింగ్ నిర్వహించారని ఆరోపించారు. మేం ఇంత శాతం తగ్గించాం, ఇన్ని వందల కోట్లు ఆదా చేశామంటూ డబ్బాలు కొట్టుకోవడం మొదలుపెట్టారని విమర్శించారు.
ఒక్క సంవత్సరంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు స్పిల్ వే సహా బ్యాలన్స్ పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తామని డ్యామ్ సైట్లో పనిచేస్తున్న కంపెనీ ముందుకొస్తే, 'ఫర్ కన్వీనియెన్స్' అంటూ ఆ సంస్థను పక్కనబెట్టారని దేవినేని ఉమ ఆరోపించారు. ఇవాళ వాళ్ల సౌకర్యం కోసం, వాళ్ల సౌలభ్యం కోసం చివరికి డ్యామ్ భద్రతను తాకట్టు పెట్టారంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. డ్యామ్ నాణ్యతను కూడా గాలికొదిలేశారని మండిపడ్డారు.
మైనస్ 14 శాతం ఎస్ఎస్ఆర్ రేట్లతో ట్రాన్స్ ట్రాయ్ సంస్థ 2013లో పనులు మొదలుపెట్టిందని, అయితే, ట్రాన్స్ ట్రాయ్ పనులు చేయలేని నేపథ్యంలో నవయుగ సంస్థ అదే ఎస్ఎస్ఆర్ రేట్లతో పనులు చేపట్టిందని వివరించారు. తమపై బురద జల్లాలని సీఎం జగన్ మైనస్ 12 శాతం ఎస్ఎస్ఆర్ రేట్లు అదనంగా వేయించారని, తత్ఫలితంగా పనుల రేటు మైనస్ 26 శాతానికి చేరిందని దేవినేని ఉమ వివరించారు.
రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టులో 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని, 194 టీఎంసీల నీరు నిలబెట్టాలని, అటువంటి డ్యామ్ లో ఇవాళ స్వార్థపూరిత రాజకీయాలతో కాంట్రాక్టర్లను, ఏజెన్సీలను లొంగదీసుకుందని ఏపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. పోలవరం పనులకు సంబంధించి సుమారు రూ.4000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నారు. ఇవాళ మేఘా కంపెనీకి రూ.150 కోట్లు డబ్బులిచ్చి, రాబోయే రోజుల్లో మరో 1000 కోట్ల రూపాయలు ఇస్తామని చెబుతున్నారని ఆరోపించారు. టీడీపీ సర్కారుపై బురదచల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రామాకు తెరలేపారని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మ్యాక్స్ ఇన్ ఫ్రాకు టన్నెల్ తవ్వే పనులకు ఉమ ఎలా అనుమతులిస్తాడని జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తనపై ఆరోపణలు చేశాడని, ఇప్పుడదే మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్థను లొంగదీసుకుని 16 శాతం తక్కువకు బిడ్డింగ్ వేయించారని ఉమ వెల్లడించారు. కొత్తగా మళ్లీ పోలవరం పనులకు టెండర్లు పిలవగా ఒకే ఒక్క టెండరు దాఖలైందని, కానీ జీవో ప్రకారం కనీసం ఇద్దరు బిడ్డర్లు ఉండాలన్నది నిబంధన అని ఉమ స్పష్టం చేశారు. దీనిపై చంద్రబాబు గారు స్పందించి ఇది రివర్స్ టెండరింగ్ కాదని రిజర్వ్ టెండరింగ్ అంటూ విమర్శలు కూడా చేశారని వెల్లడించారు.
ప్రాజెక్టులో భాగమైన ఇరిగేషన్, పవర్ ప్రొడక్షన్ పనులకు ఇష్టానుసారం గడువులు పొడిగించారని, ఐదేళ్లు, మూడేళ్లు అంటూ కాలపరిమితి విధించారని, ఈ ఆలస్యం వల్ల సంవత్సరానికి రూ.10 వేల కోట్లు నష్టం వాటిల్లుతుందని అన్నారు. కేంద్రం నుంచి ఇప్పటివరకు రూ.4500 కోట్లు రావాల్సి ఉన్నా, మూడ్నెల్లుగా ఆ డబ్బులు తెచ్చుకోవడం మాత్రం ఈ ప్రభుత్వానికి చేతకాలేదని ఎద్దేవా చేశారు.
పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి గారి దర్శకత్వంలో జగన్ నడుస్తున్నాడని, దాంతో పోలవరం ఎత్తు తగ్గించాలని ఫిక్సైపోయారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంత ఇంజినీర్లు పోలవరం ప్రాజెక్టును పరిశీలించి, భద్రాచలం ఇతర ముంపు ప్రాంతాలకు వరద ముప్పులేని రీతిలో ఎత్తు తగ్గింపుపై ప్రతిపాదనలు చేస్తే, వాటిని సీఎం జగన్ అంగీకరించాడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబరు 15న అసెంబ్లీలో చాలా స్పష్టంగా వెల్లడించాడని ఉమ వివరించారు.