Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో పర్యావరణవేత్త రాజేంద్రసింగ్ భేటీ
- యురేనియం తవ్వకాలు, జల సంరక్షణపై చర్చ
- యురేనియం తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు
- నదులు, చెరువులు కలుషితమవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు: రాజేంద్రసింగ్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో పర్యావరణవేత్త రాజేంద్రసింగ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ఈరోజు సమావేశమై.. యురేనియం తవ్వకాలు, జల సంరక్షణపై చర్చించారు. యురేనియం తవ్వకాల మూలంగా పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగి మానవాళి మనుగడకు ముప్పు వస్తుందని రాజేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియం మూలంగా పర్యావరణం తీవ్రంగా దెబ్బ తింటుంది అని చెబుతూ ఈ తవ్వకాలు మానవాళికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని అన్నారు. జల నిర్వహణ సమర్థంగా ఉన్నప్పుడే పాలన సక్రమంగా ఉన్నట్లని ఆయన అభిప్రాయపడ్డారు. నదులు, తటాకాలు, చెరువులను కలుషితం చేస్తున్నా ప్రభుత్వాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయని, పాలకులకు పర్యావరణంపై శ్రద్ధ లేదని విమర్శించారు. జనసేన తరఫున యురేనియం అన్వేషణ, తవ్వకాలపై నిర్వహించే సమావేశాలు, జలరక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. ఈ అంశాలపై మరోసారి భేటీ కావాలని పవన్ కళ్యాణ్ , రాజేంద్ర సింగ్ నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో జనసేన అధికార ప్రతినిధి, జల్ బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.