Jammu And Kashmir: కశ్మీర్లో దశాబ్దాలుగా మూతపడిన ఆలయాలను పునరుద్ధరిస్తాం: కిషన్ రెడ్డి వెల్లడి
- ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ పరిస్థితులపై సర్వే
- దేవాలయాలు, పాఠశాలలకు కొత్తరూపు
- కశ్మీర్ లోయలో సినిమా థియేటర్లు తెరుస్తామన్న కిషన్ రెడ్డి
జమ్మూకశ్మీర్ సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కశ్మీర్ లో దశాబ్దాలుగా మూతపడిన ఆలయాలు, పాఠశాలలకు పునరుజ్జీవం కల్పిస్తామని తెలిపారు. దాదాపు 50 వేల ఆలయాలను పునరుద్ధరిస్తామని చెప్పారు. వాటిలో చాలావరకు ధ్వంసమయ్యాయని అన్నారు. గత పాలకుల విధానాలు, ఉగ్రవాదం కారణంగా కశ్మీర్ అస్తవ్యస్తంగా మారిందని, కశ్మీర్ కు కొత్తరూపు కల్పించే బాధ్యతను ఇప్పుడు కేంద్రం స్వీకరించిందని కిషన్ రెడ్డి వెల్లడించారు.
గత 20 సంవత్సరాల కాలంలో కశ్మీర్ లోయలో సినిమా థియేటర్లు మూతపడ్డాయని, త్వరలోనే వాటిని కూడా పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. అందుకోసం జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా సమగ్ర సర్వే చేపడతామని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ పై ప్రత్యేకంగా దృష్టి సారించిన కేంద్రం తాజాగా సర్వే చేయాలని నిర్ణయించింది.