Narendra Modi: టన్నుల కొద్దీ మాటల కంటే ఒక ఔన్సు కార్యాచరణ ఎంతో గొప్పది: మోదీ ఉద్ఘాటన
- వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ ప్రసంగం
- ప్రపంచం ప్లాస్టిక్ రహితం కావాలని ఆకాంక్ష
- భారత్ వద్ద కార్యాచరణ మార్గసూచీ సిద్ధంగా ఉందని వెల్లడి
అమెరికా పర్యటనను దిగ్విజయంగా కొనసాగిస్తున్న ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితిలో వాతావరణ మార్పులపై ప్రసంగించారు. వాతావరణ మార్పులు ఎదుర్కొనేలా మానవాళిలో మార్పు రావాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజాఉద్యమం తప్పనిసరి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనశక్తి సాధన దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఉద్ఘాటించారు. ప్రకృతిని భారత్ ఎప్పుడూ ఓ అవసరంగానే భావిస్తుందే తప్ప, ప్రకృతిపై అత్యాశకు పోదని స్పష్టం చేశారు.
వాతావరణ మార్పులు ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు కలిసిరావాలని అంతర్జాతీయ వేదిక మీద నుంచి మోదీ పిలుపునిచ్చారు. అందుకు తగిన కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్ ఈ విషయంలో ముందుందని, దీనికి సంబంధించిన కార్యాచరణ మార్గసూచీ తమవద్ద సిద్ధంగా ఉందని ప్రధాని వెల్లడించారు. ప్లాస్టిక్ రహిత దేశంగా భారత్ అడుగులు వేస్తోందని, ప్రపంచమంతా ఈ దిశగా అడుగులు వేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. టన్నుల కొద్దీ మాటల కంటే ఒక ఔన్సు కార్యాచరణ ఎంతో గొప్పదని అభిప్రాయపడ్డారు.