Amanchi krishnamohan: చీరాలలో పాత్రికేయుడు నాగార్జునరెడ్డిపై దాడి.. పరిస్థితి విషమం
- వైసీపీ నేత ఆమంచిపై ఫిర్యాదు చేసి వస్తుండగా కిడ్నాప్
- కాపుకాసి దాడిచేసిన దుండగులు
- ఆమంచి అనుచరులుగా అనుమానం
గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో గాయపడిన చీరాలకు చెందిన పాత్రికేయుడు నాయుడు నాగార్జున రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే అయిన వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్, ఆయన అనుచరుల అకృత్యాలపై ఒంగోలులో ఎస్పీకి ఫిర్యాదు చేసి వస్తున్న నాగార్జునరెడ్డిపై దాడి జరిగింది. దీంతో ఆయనపై దాడిచేసింది కృష్ణమోహన్ అనుచరులే అయి ఉంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, నాగార్జునపై గతంలోనూ దాడి జరిగింది. ఆమంచి సోదరుడు స్వాములు అలియాస్ శ్రీనివాసరావు గడియారం స్తంభం సెంటర్లో దాడి చేశారు.
తాజాగా, ఎస్పీకి ఫిర్యాదు చేసి స్నేహితుడు కృష్ణ ద్విచక్ర వాహనంపై వేటపాలెంవైపు వస్తుండగా ఉప్పుగుండూరు, చినగంజాం మధ్య వారిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. నాగార్జునరెడ్డిని అక్కడ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తప్పించుకున్న కృష్ణ.. విషయాన్ని నాగార్జున కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో ఆయనను కిడ్నాప్ చేసింది ఆమంచి అనుచరులే అయి ఉంటారని కుటుంబ సభ్యులు ఓ నిర్ణయానికి వచ్చారు.
మరోవైపు, రాత్రి 7:53 గంటల సమయంలో కొత్తపేట ఏఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ సమీపంలో ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో పడి ఉన్నాడన్న సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది నాగార్జునను చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వచ్చి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించగా, నాగార్జునరెడ్డి మాట్లాడే పరిస్థితుల్లో లేడని వైద్యులు తెలిపారు. కాగా, నాగార్జున రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని, ఆయనపై దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించబోమని డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి హెచ్చరించారు. తన భర్తపై దాడి చేసిన వారిని, అందుకు ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని నాగార్జునరెడ్డి భార్య జ్యోతి డిమాండ్ చేశారు.