East Godavari District: అవకాశం ఇవ్వండి.. బోటును తీసి చూపిస్తా: మత్స్యకారుడు వెంకటశివ
- శని, ఆదివారాల్లో మూడు మృతదేహాలు స్వాధీనం
- మూడేళ్ల చిన్నారిని విశాఖకు చెందిన కుషాలిగా గుర్తింపు
- బోటును తీసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరిన వెంకటశివ
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన 15 మంది జాడ ఇప్పటికీ తెలియరాలేదు. బోటును వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సహాయక బృందాలు, నేవీ ఎప్పుడో వెనక్కి వెళ్లిపోయాయి. ఇక, శనివారం ఓ చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన అధికారులు ఆమెను విశాఖపట్టణానికి చెందిన మధుపాక కుషాలి (3)గా గుర్తించారు. ఆదివారం కనిపించిన రెండు మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది.
కాగా, గోదావరి నదిలో దాదాపు 200 అడుగుల లోతున బోటు ఉన్నట్టు గుర్తించినప్పటికీ తీయడం సాధ్యం కాలేదు. దీంతో అధికారులు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. అయితే, తనకు కనుక అవకాశం ఇస్తే బోటును బయటకు తీస్తానని పశ్చిమగోదావరి జిల్లా పసివేదలకు చెందిన మత్స్యకారుడు వెంకటశివ పేర్కొన్నాడు. బోటును బయటకు తీయగలనన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.