East Godavari District: గోదావరి బోటు ప్రమాదం కేసులో మరో ఇద్దరి అరెస్టు
- నిందితుల్లో జలశ్రీ మురళి, యర్రంశెట్టి రాజారావు
- పాపికొండలు బోటు ఓనర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు
- ప్రయాణాలు ప్రారంభించడంలో వీరిది కీలకపాత్ర
గోదావరి బోటు ప్రమాద ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. బోటు ప్రయాణాలను నిర్ణయించడంలో వీరు కీలకపాత్ర పోషిస్తారని తేలడంతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు మునిగిపోయిన ఘటనలో 36 మంది మృతి చెందగా మరో 15 మంది ఆచూకీ గల్లంతైన విషయం తెలిసిందే. మొత్తం 77 మంది ప్రయాణించగా 26 మంది ప్రాణాలు దక్కించుకున్నారు.
ఇక ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే బోటు యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా, పోర్టు అధికారులు ఇచ్చిన సర్క్యులర్ ఆధారంగా బోటు ప్రయాణాలను ప్రారంభించే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న గేడా వీరవెంకటరమణ సత్యనాగమురళి (జలశ్రీ మురళి), సర్ ఆర్దర్ కాటన్ ఏపీ బోటు యజమానుల సంఘం అధ్యక్షుడు యర్రంశెట్టి రాజారావులను నిన్న అరెస్టు చేసి రంపచోడవరం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. మూడు రోజుల క్రితం మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.