kodikathi srini: జైల్లో మా తమ్ముడిని వేధిస్తున్నారు: జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీను సోదరుడి ఆరోపణ
- రాజమహేంద్రవరం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు
- జైలు అధికారులు మానసికంగా క్షోభ పెడుతున్నారని ఆవేదన
- కేసును పశ్చిమబెంగాల్ లేదా కేరళకు బదిలీ చేయాలని విజ్ఞప్తి
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై హత్యా యత్నం కేసులో నిందితుడిగా ఉండడంతో జైలు అధికారులు తన సోదరుడిని మానసికంగా హింసిస్తున్నారని జనుపల్లి శ్రీను సోదరుడు జనుపల్లి సుబ్బరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గత ఏడాది అక్టోబర్‌లో అప్పటి విపక్షనేత, ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో శ్రీను దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న శ్రీనును అక్కడి అధికారులు వేధిస్తున్నారని సుబ్బరాజు నిన్న రాజమహేంద్రవరం ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేశారు.
ముఖ్యమంత్రిపైనే దాడిచేసినట్టు తన సోదరుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నందున జైలు అధికారులు ఇలా హింసిస్తున్నారని, అందువల్ల కేసును పశ్చిమబెంగాల్‌కు లేదా కేరళ రాష్ట్రానికి బదిలీచేసి అక్కడి కోర్టులో విచారణ జరిపించాలని తన ఫిర్యాదులో కోరారు. సుబ్బరాజు వెంట శ్రీను తరపు న్యాయవాది అబ్దుల్ సలీం ఉన్నారు.