Devineni Uma: పోలవరం ప్రాజక్టులో జగన్ చిత్రవిచిత్రాలు చేస్తున్నారు: దేవినేని ఉమ
- పోలవరం పనులు 28 నెలలు ఆలస్యం అవుతాయన్న ఉమ
- సింగిల్ టెండర్ ద్వారా ఎలాంటి వెసులుబాట్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్
- కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ వివరణ ఇవ్వాలంటూ వ్యాఖ్యలు
పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ చేపట్టడంపై ప్రభుత్వాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఈ విషయంలో మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో సీఎం జగన్ చిత్రవిచిత్రాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సింగిల్ టెండర్ ద్వారా ఎలాంటి వెసులుబాట్లు ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం ద్వారా పోలవరం పనులు మరో 28 నెలలు ఆలస్యం అవుతాయని అన్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా జలవనరుల మంత్రి లేకుండానే కీలక చర్చలు జరిపారని, అధికారులు, ఇంజినీర్లు లేని ఆ సమావేశంలో కాంట్రాక్టర్లతో ఏకబిగిన 4 గంటల పాటు చర్చలు జరిపారని ఉమ ఆరోపించారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.