Balineni: విద్యుత్ ఒప్పందాలను పునఃసమీక్ష చేస్తే అదేమన్నా తప్పా?: ఏపీ మంత్రి బాలినేని వ్యాఖ్యలు
- గత ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తిన మంత్రి
- బకాయిలు రూ.20 వేల కోట్లు దాటాయని వెల్లడి
- టీడీపీ నేతల వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శ
ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై స్పందించారు. విద్యుత్ ఒప్పందాలను పునఃసమీక్ష చేయడం అపరాధమా? అంటూ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా భారీగా విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని, విద్యుత్ సంస్థల బకాయిలు రూ.20 వేల కోట్లు దాటిపోయాయని వెల్లడించారు. పీపీఏలపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. అధిక ధరలకు కుదుర్చుకున్న ఒప్పందాలనే తాము పునఃసమీక్షిస్తున్నామని స్పష్టం చేశారు.
తాము తీసుకున్న చర్యలన్నీ ప్రజాప్రయోజనాల కోసమేనని మంత్రి వివరణ ఇచ్చారు. పీపీఏల పునఃసమీక్ష అంశాన్ని హైకోర్టు ఈఆర్సీకి అప్పగించిందని ఆయన వెల్లడించారు. పంపిణీ సంస్థలు నష్టపోకుండా ఉండాలంటే పీపీఏలపై సమీక్ష జరపాల్సిందేనని అభిప్రాయపడ్డారు. విద్యుత్ చార్జీలు తక్కువగా ఉంటేనే ప్రజలకు, పారిశ్రామిక రంగానికి మేలు జరుగుతుందని చెప్పారు.