Donald Trump: మోదీని భారత జాతిపితగా అభివర్ణించిన ట్రంప్.. కశ్మీర్ సంగతిని ఆయనే చూసుకుంటారన్న అమెరికా అధ్యక్షుడు
- ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్న మోదీ
- అంతర్గత కుమ్ములాటలతో సతమతమైన భారత్‌ను ఏకం చేశారన్న ట్రంప్
- కశ్మీర్ విషయాన్ని మోదీ తేల్చుకుంటారన్న అధ్యక్షుడు
భారత ప్రధాని నరేంద్రమోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రశంసతో ఆశ్చర్యపరిచారు. మోదీని భారత జాతిపితగా అభివర్ణించారు. మోదీ చాలా పెద్ద మనిషి అని, గొప్ప నాయకుడని పేర్కొన్న ట్రంప్ ఆయనంటే తనకెంతో గౌరవమని అన్నారు. అసమ్మతితో, అంతర్గత కుమ్ములాటలతో సతమతమైన భారత్‌ను ఆయన ఏకం చేశారని, ఓ తండ్రిలా ఆయన అందరినీ దరిచేర్చారని ప్రశంసించారు.
ఇక నుంచి ఆయనను తాము భారత జాతిపిత (ఫాదర్ ఆఫ్ ఇండియా) గా పిలుస్తామని స్పష్టం చేశారు. ప్రముఖ పాప్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీకి ఉన్నంత ప్రజాదరణ మోదీకి ఉందంటూ ఆకాశానికెత్తేశారు. మంగళవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశం విషయంలో మోదీ, ఇమ్రాన్ కలిసి ఏదో ఒకటి తేల్చుకుంటారని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.