azadpur sabji mandi: అజాద్‌పూర్ సబ్జి మండిలో మండుతున్న ఉల్లి ధర!
- ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలో 70 ఎకరాల్లో విస్తరణ
- ఉల్లి ధర కన్నీళ్లు పెట్టిస్తుండడంతో మార్కెట్ గురించి చర్చ
- ప్రస్తుతం ఈ మార్కెట్‌లో కిలో రూ.70 పై మాటే
అజాద్‌పూర్ సబ్జి మండి...దేశవ్యాప్తంగా ఉల్లి ధర ఘాటెక్కి జనానికి కన్నీళ్లు తెప్పిస్తుండడంతో ప్రస్తుతం ఈ మార్కెట్ పేరు మారుమోగుతోంది. ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలో 70 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ మార్కెట్ దేశంలోనే కాదు దక్షిణాసియాలోనే పండ్లు, కూరగాయల అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్.
ఈ మార్కెట్‌లోనే ప్రస్తుతం ఉల్లి ధర 70 రూపాయలు పలుకుతోందంటే ఇక రిటైల్ ధర గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఏడాది పొడవునా రాత్రీపగలు అన్న తేడా లేకుండా 24 గంటలు లావాదేవీలు నడిచే మార్కెట్ ఇది. రోజుకి సగటున 25 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఈ మార్కెట్‌కు సరకు రవాణా కోసం ఏకంగా ప్రత్యేక రైలు మార్గమే అందుబాటులో ఉందంటే మార్కెట్ ప్రాధాన్యం అర్థమవుతుంది.
20 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ మార్కెట్‌కు దేశం నలుమూలల నుంచి రోజుకి ఐదు వేల ట్రక్కులు వివిధ రకాల పండ్లు, కూరగాయలతో చేరుకుంటాయంటే మార్కెట్ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాలకు పలు రకాల సరుకులు వెళ్లడం, రావడం జరుగుతుంది. దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్య పట్టణాలకు, ప్రధాన నగరాలకు ఉల్లిపాయలు కూడా ఇక్కడి నుంచే సరఫరా అవుతుంటాయి.
అటువంటి మార్కెట్‌లోనే ఉల్లి ధర ఆకాశాన్ని అంటడంతో స్థానిక వినియోగదారులు కూడా గగ్గోలు పెడుతున్నారు. అతి పెద్ద మార్కెట్ కావడంతో ఇక్కడ దళారీ వ్యవస్థ కూడా బలంగానే ఉంటుంది. ప్రస్తుతం ఉల్లి సంక్షోభంలో కూడా ఎక్కువగా లాభపడుతున్నది దళారీలే. కిలో ఉల్లి 70 రూపాయల ధర పలుకుతున్నా తమకు దక్కుతున్నది కిలోకు 30 రూపాయలే అని రైతులు చెబుతున్నారంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.