Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు విద్యార్థి సంఘం నుంచి బెదిరింపులు
- ఫేస్బుక్లో ఈ మేరకు పోస్టింగ్
- నీకు ఉరిశిక్ష రెడీగా ఉందంటూ హెచ్చరికలు
- ఈనెల 27న విచారణకు రానున్న కృష్ణజింకను వేటాడిన కేసు
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌పై పంజాబ్ విద్యార్థి సంఘం ఫేస్బుక్ వేదికగా బెదిరింపులకు పాల్పడుతుండడం చర్చనీయాంశమైంది. ‘సల్మాన్...నీకు ఉరిశిక్ష రెడీగా ఉంది. నువ్వు తప్పించుకోలేవు’ అంటూ పెట్టిన పోస్టింగ్స్‌పై చర్చ సాగుతోంది.
వివరాల్లోకి వెళితే... 1990ల్లో ఓ సినిమా చిత్రీకరణ సమయంలో జోధ్‌పూర్ అడవుల్లో కృష్ణజింకను వేటాడినట్టు సల్మాన్‌తో పాటు ఆ సమయంలో అతనితో ఉన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రేలపై కేసు నమోదయ్యింది. జోధ్‌పూర్ న్యాయస్థానం విచారణలో సల్మాన్ ఒక్కరే దోషిగా తేలారు. ఆయనకు ఐదేళ్ల కారాగార శిక్ష పడింది. దీంతో జైలుపాలైన సల్మాన్ ఒక రోజు జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో గడిపాడు. మరునాడు ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటికి వచ్చాడు.
ఎప్పుడో జరిగిపోయిన సంఘటన కాబట్టి తనపై వేసిన కేసును మరోసారి పరిశీలించి కొట్టివేయాలని ఈ ఏడాది జులైలో జోధ్‌పూర్ సెషన్స్ కోర్టులో సల్మాన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ఈ నెల 27న విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ యూనివర్శిటీకి చెందిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ తమ ఫేస్బుక్ లో ఓ పోస్టు పెట్టింది.
‘సల్మాన్... భారతీయ చట్టం నుంచి నువ్వు తప్పించుకోగలననుకుంటున్నావేమో. బిష్ణోయ్ సమాజ్, పంజాబ్ యూనివర్శిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్లు నీకు ఎప్పుడో ఉరిశిక్షను ఖాయం చేశాయి. నువ్వు మా కోర్టులో దోషివి. నీకు శిక్ష తప్పదు' అని ఆ పోస్టింగ్ లో పేర్కొన్నారు. ఇంకా 'అమ్మాయిలను గౌరవించు. జంతువులను రక్షించు. డ్రగ్స్‌కి దూరంగా ఉండు. పేదలకు సాయం చేయడం అలవాటు చేసుకో’ అని కూడా రాశారు. ఈ బెదిరింపులతో పోలీసులు అలర్ట్ అయ్యారు.