Venumadhav: ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాధవ్ మృతి
- సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో కన్నుమూత
- మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభం
- 600లకు పైగా చిత్రాల్లో నటించిన వేణుమాధవ్
ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. లివర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ నెల 6న యశోదా ఆసుపత్రిలో చేరారు. వేణుమాధవ్ మరణవార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. వేణుమాధవ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చిన్నప్పటి నుంచి వేణుమాధవ్ కు మిమిక్రీ అంటే చాలా ఇష్టం. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన వేణుమాధవ్... తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఓ షో చేశాడు. ఆ షో దివంగత ఎన్టీఆర్ ను ఎంతగానో ఆకట్టుకుంది. కొంత కాలంపాటు టీడీపీ కార్యాలయంలో కూడా వేణుమాధవ్ పని చేశారు. ఆ తర్వాత సినీరంగంలో అడుగుపెట్టారు. 'సంప్రదాయం' చిత్రంతో వెండితెరకు పరిచయమైన వేణు... అంచెలంచెలుగా ఎదుగుతూ... స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందారు. హీరోగా కూడా నటించారు. 600లకు పైగా సినిమాల్లో నటించి టాలీవుడ్ లో తనదైన ముద్రను వేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు.