Venumadhav: రేపు ఫిలిం ఛాంబర్ కు వేణుమాధవ్ పార్థివదేహం: శివాజీరాజా
- అనతికాలంలోనే వేణుమాధవ్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు
- పేద ప్రజలకు సాయం చేసిన గొప్ప వ్యక్తి
- వేణు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు
వేణుమాధవ్ మరణవార్తతో టాలీవుడ్ షాక్ కు గురైంది. అందరినీ నవ్విస్తూ ఉండే వేణుమాధవ్ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. కాసేపటి క్రితం సినీ నటులు శివాజీరాజా, అలీ, ఉత్తేజ్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ, అనతికాలంలోనే వేణుమాధవ్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారని అన్నారు.
పేద ప్రజల కోసం తన వంతు సాయం చేసిన గొప్ప వ్యక్తి అని కితాబిచ్చారు. వేణు కారులో ఎప్పుడూ ఆహార పదార్థాలు ఉంటాయని... వాటిని పేదలకు పంచేవాడని చెప్పారు. అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో రేపు వేణుమాధవ్ పార్థివదేహాన్ని ఉంచుతామని తెలిపారు. వేణుమాధవ్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పారు.
వేణు టాలెంట్ ను చూసి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్లో అవకాశం ఇచ్చారని శివాజీరాజా తెలిపారు. 'మా' అసోసియేషన్ లో తనతో కలసి పని చేశాడని చెప్పారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించాడని, ఆసుపత్రికి వెళ్దామని చెప్పినా రానన్నాడని, బలవంతంగా ఆసుపత్రికి తీసుకొచ్చామని కుటుంబసభ్యులు చెప్పారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.