polavaram: ‘పోలవరం’పై శ్వేతపత్రం విడుదల చేయాలి: బీజేపీ ఎంపీ సుజనాచౌదరి డిమాండ్
- వైసీపీ ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్యబద్ధంగా లేదు
- రివర్స్ టెండరింగ్ తో పోలవరం పనుల్లో కాలయాపన
- పీపీఏల విషయంలో దేశ వ్యాప్తంగా చెడ్డపేరు వస్తోంది
పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాలుగు నెలల వైసీపీ ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్యబద్ధంగా లేదని, రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరం పనుల్లో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
టెండర్లలో సీవీసీ మార్గదర్శకాల మేరకు ముందుకెళ్లాల్సి ఉందని సూచించారు. గతంలో పోలవరం టెండర్లలో ఎల్ 2గా వచ్చిన ఇంజనీరింగ్ సంస్థ, ఇప్పుడు తన బిడ్ ను తగ్గించి వేయడంలో ఉద్దేశం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. టెక్నికల్ బిడ్ కాదు కనుక ఎవరికీ ఏమీ అర్థం కావట్లేదని విమర్శించారు. ఈ సందర్భంగా పీపీఏల రద్దు అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ విషయంలో దేశ వ్యాప్తంగా చెడ్డపేరు వస్తోందని, వీటిని రద్దు చేయడం వల్ల ఏపీకి కొత్తగా పరిశ్రమలు రావని అన్నారు. ఉద్యోగాల కల్పనలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.