Maharashtra: పూణె నగరంలో భారీ వర్షాలు.. 11 మంది మృతి
- జలమయమైన నగరం
- గోడ కూలి ఐదుగురి దుర్మరణం
- వేర్వేరు ఘటనల్లో మరో ఆరుగురి మృతి
మహారాష్ట్రలోని పూణె నగరాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా జరిగిన వేర్వేరు ఘటనల్లో ఏకంగా 11 మంది మృత్యువాత పడ్డారు. రెండు రోజులుగా నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నడుం లోతు నీరు నిలిచి ఉంది.
కాగా, బుధవారం రాత్రి నుంచి జరిగిన పలు ఘటనల్లో మొత్తం 11 మంది చనిపోయారు. సహకర్ నగర్‌లో గోడ కూలిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో తొమ్మిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఈ ప్రాంతంలోనే ఓ కారు కొట్టుకు పోవడంతో కారులో వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తి నీటి ప్రవాహంలో మునిగి అసువులు బాసాడు. మరో నలుగురు వేర్వేరు ఘటనల్లో చనిపోయారు.
దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలకు అధికారులను ఆదేశించింది. పరిస్థితి చక్కబడే వరకు అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. కాగా మృతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపం తెలిపారు.