huzurnagar: మనసు మార్చుకున్న బీజేపీ... హుజూర్‌నగర్‌లో బీసీ అభ్యర్థితో రంగంలోకి?
- అభ్యర్థిని మార్చనున్నట్లు ప్రచారం
- ఇప్పటికే కళా రెడ్డికి టికెట్టు ఇస్తారని వార్తలు
- తాజాగా కోట రామారావుపై దృష్టిపెట్టినట్లు సమాచారం
తెలంగాణలోని హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ తన వ్యూహాన్ని మారుస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో బలపడ్డామని, వచ్చే ఎన్నికల నాటికి సత్తాచాటుతామని చెప్పుకుంటున్న కమలదళం నేతలు హుజూర్నగర్ ఎన్నిక ద్వారా ట్రైల్ వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలవడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు సిట్టింగ్ కాంగ్రెస్‌తోపాటు అధికార టీఆర్ఎస్, బీజేపీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఉత్తమ కుమార్ భార్యకు టికెట్టు కేటాయించగా, టీఆర్ఎస్ కూడా అభ్యర్థిని ప్రకటించింది. రెండు పార్టీల అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తాము కూడా అదే సామాజిక వర్గం అభ్యర్థిని బరిలోకి దించాలని బీజేపీ యోచిస్తూ కళారెడ్డి పేరును తెరపైకి తెచ్చింది.
తాజా పరిణామాలతో బీజేపీ తన వ్యూహం మార్చి బీసీ అభ్యర్థికి సీటు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం డాక్టర్ కోట రామారావు పేరు పరిశీలిస్తోందని, ఈరోజు సాయంత్రంలోగా ఆయన పేరును బీజేపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.