Saudi Arabia: అంతర్జాతీయ పర్యాటకులకు ద్వారాలు తెరిచిన సౌదీ అరేబియా
- తొలిసారిగా టూరిస్టు వీసాల జారీకి నిర్ణయం
- సౌదీ యువరాజు విజన్ 2030లో పర్యాటక రంగానికి చోటు
- విదేశీ మహిళల కోసం నిబంధనలు సడలించడానికి సౌదీ సంసిద్ధత
అత్యంత కఠినమైన చట్టాలు కలిగిన దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. సాధారణ నేరాలకు కూడా కఠిన శిక్షలు అమలు చేస్తారు. ఇక్కడ చమురు ప్రధాన ఆదాయ వనరు. అయితే, ఇటీవల ఉగ్రదాడుల కారణంగా చమురు సంక్షోభం తలెత్తడంతో ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై సౌదీ సర్కారు దృష్టిపెట్టింది.
ఈ క్రమంలో అంతర్జాతీయ పర్యాటకులకు ద్వారాలు తెరిచింది. ఇకనుంచి టూరిస్టు వీసాలు జారీ చేయాలని సౌదీ పాలకవర్గం నిర్ణయించింది. సౌదీ యువరాజు విజన్ 2030 ప్రకారం టూరిజంను కూడా ఇతర రంగాలకు దీటుగా అభివృద్ధి చేసే క్రమంలో ఈ పర్యాటక వీసాల మంజూరు కీలక పరిణామం అని భావిస్తున్నారు.
సౌదీ అరేబియా పర్యాటక విభాగం చీఫ్ అహ్మద్ అల్ ఖతీబ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ పర్యాటకులకు సౌదీ అరేబియా ద్వారాలు తెరవడం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు. సౌదీలో ఉన్న సందర్శనీయ స్థలాలు చూసి పర్యాటకులు అచ్చెరువొందడం ఖాయమని, ఐదు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఇక్కడే ఉన్నాయని వివరించారు. విదేశీ మహిళలకు డ్రెస్ కోడ్ ను కూడా సడలిస్తామని, సంప్రదాయ అబాయా రోబ్ తప్పనిసరిగా ధరించాల్సిన నిబంధనను ఎత్తివేస్తామని చెప్పారు.