Imran Khan: ఆత్మాహుతి దాడులు మొదలుపెట్టింది హిందువులే, వారిని ఎవరూ ఉగ్రవాదులుగా ముద్రవేయలేదు: ఇమ్రాన్ ఖాన్
- ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని ప్రసంగం
- యూరప్ దేశాలు ముస్లింలను అణచివేస్తున్నాయని ఆరోపణ
- ఇస్లామిక్ ఫోబియా పెరిగిపోతోందంటూ వ్యాఖ్యలు
న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రసంగించారు. సెప్టెంబరు 11 దాడులకు ముందు తమిళ (శ్రీలంక-ఎల్టీటీఈ) హిందువులే ఆత్మాహుతి దాడులు చేసేవాళ్లని, ఆ రోజుల్లో హిందువులను ఎవరూ ఉగ్రవాదులుగా ముద్రవేయలేదని అన్నారు. కానీ కొందరు నేతలు ఉగ్రవాదాన్ని ముస్లిం మతంతో ముడిపెట్టారని, ముస్లింలను అసహనవాదులుగా చిత్రీకరించారని తెలిపారు. మతానికి టెర్రరిజానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.
యూరోపియన్ దేశాలు ముస్లింలను అణచివేస్తున్నాయని, ముస్లింలపై అణచివేతను ముస్లిం దేశాల నేతలు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రపంచంలో ఇస్లామిక్ ఫోబియా క్రమంగా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబరు 11 దాడుల అనంతరం యూరప్ లో ముస్లిం వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయిందని, ముస్లింలను ఆత్మాహుతి దళ సభ్యులుగా ముద్రవేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రపంచవ్యాప్తంగా పలు మతాలు ముస్లింలను రాడికల్స్ గా ముద్రవేశాయని, సూటుబూటు వేసుకున్నంత మాత్రాన ఆధునికులు కారని అన్నారు. మహ్మద్ ప్రవక్త జీవితం ఆదర్శనీయం అని, ప్రతి ఒక్కరూ తమ మతాన్ని అవలంబించుకోవచ్చని, చట్టానికి ఎవరూ అతీతులు కారని ప్రవక్త చెప్పారని ఇమ్రాన్ వివరించారు. ఏ మతంలో లేని విధంగా ముస్లింలలో బానిస వ్యవస్థ అంతమైందని అన్నారు. శాంతిస్థాపనకు పాకిస్థాన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఉద్ఘాటించారు.