Imran Khan: కశ్మీర్ లో కర్ఫ్యూ ఎత్తేసి చూడండి ఏం జరుగుతుందో!: ఇమ్రాన్ ఖాన్ కవ్వింపులు
- ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని ప్రసంగం
- భారత్ పై అక్కసు వెళ్లగక్కిన వైనం
- అణుయుద్ధం వస్తే రెండు దేశాలకే పరిమితం కాదని వ్యాఖ్యలు
భారత్ పై తన అక్కసును పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వెళ్లగక్కారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ కశ్మీర్ లో 55 రోజులుగా కర్ఫ్యూ విధించారని, ఒక్కసారి కర్ఫ్యూ ఎత్తేస్తే ఏంజరుగుతుందో చూస్తారని కవ్వింపు ధోరణిలో వ్యాఖ్యానించారు. పుల్వామాలో మరోసారి ఉగ్రదాడి జరిగితే భారత్ నిందించేది తమనే అని ఇమ్రాన్ ఆరోపించారు. ఇన్నాళ్లు బంధించి ఇప్పుడు కర్ఫ్యూ ఎత్తేస్తే కశ్మీర్ యువత తుపాకీ చేతబట్టక ఇంకేం చేస్తుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలను మీరే ఉగ్రవాదులుగా మారుస్తున్నారంటూ మండిపడ్డారు.
యుద్ధం వస్తే నివారించడానికే ఐక్యరాజ్యసమితి ఉందని, ఇప్పుడా సంస్థ 120 కోట్ల మంది పక్షాన ఉంటుందా, న్యాయం వైపు ఉంటుందా? అంటూ పెద్దమనిషి తరహాలో ప్రశ్నించారు. కశ్మీర్ లో ప్రజలను జంతువుల్లా పరిగణించి, బంధించారని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. ఒకవేళ భారత్, పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం వస్తే అది రెండు దేశాలకే పరిమితం కాదని నర్మగర్భంగా హెచ్చరించారు.