Nagarjuna sagar: శ్రీశైలం జలాశయానికి భారీగా పెరిగిన వరద ప్రవాహం.. కుడి, ఎడమగట్లలో విద్యుదుత్పత్తి
- ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు
- నిండుకుండలా మారిన జలాశయం
- నాగార్జున సాగర్‌కు 3 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్న అధికారులు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. వరదనీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయ నీటి మట్టం 884.70 అడుగులుగా ఉండగా, నిల్వసామర్థ్యం 213.8824 టీఎంసీలుగా ఉంది. కాగా, జలాశయంలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతుండడంతో 3 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదిలిపెడుతున్నారు.
జలాశయంలోని పది క్రస్టుగేట్లను పది అడుగుల మేర పైకెత్తిన అధికారులు 2,79,370 క్యూసెక్కులను వదిలి కుడి, ఎడమగట్లలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. తద్వారా 69,007 క్యూసెక్కులను సాగర్‌కు వదులుతున్నారు. మరోవైపు జూరాల నుంచి 1,47,376 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 53,768 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 11 వేల క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి వస్తోంది.