saidabad: మద్యం మత్తులో నడిరోడ్డుపై బైఠాయించి మహిళ వీరంగం.. సీఐపై ఆరోపణలు
- డ్రంకెన్ డ్రైవ్లో దొరికిన డ్రైవర్
- కారును సీజ్ చేసిన పోలీసులు
- ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన మహిళ
డ్రంకెన్ డ్రైవ్లో దొరికిన ఓ మహిళ నడిరోడ్డుపై బైఠాయించి వీరంగమేసింది. అంతేకాదు, సీజ్ చేసిన తనకారును వదిలిపెట్టేందుకు సీఐ రూ.5 వేల లంచం అడిగారంటూ ఆరోపణలు చేసింది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఉద్రిక్తతకు కారణమైంది. పోలీసుల కథనం ప్రకారం.. సింగరేణి కాలనీకి చెందిన మునావత్ పద్మ, శ్రీనులు కారులో వస్తుండగా గురువారం రాత్రి చంపాపేట రోడ్డులోని మినర్వ గార్డెన్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఆపారు. పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో డ్రైవర్ మద్యం తాగినట్టు తేలింది. దీంతో కారును సీజ్ చేశారు.
పోలీసులు కారును సీజ్ చేయడంతో కిందికి దిగిన పద్మ, శ్రీనులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న పద్మ పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. సీజ్ చేసిన కారును విడిచిపెట్టేందుకు సీఐ సాయి ఈశ్వర్ గౌడ్ 5 వేల రూపాయల లంచం అడిగారని పద్మ ఆరోపించింది. అక్కడితో ఆగక తన వద్ద అంత డబ్బు లేదని చెబుతూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. డ్రైవర్ మద్యం తాగలేదని, తాము మాత్రమే తాగామని శ్రీను తెలిపాడు. కాగా, పద్మ చేసిన ఆరోపణలు అవాస్తవమని పోలీసులు కొట్టిపారేశారు. విధులకు ఆటంకం కలిగించినందుకు గాను వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.