Narendra Modi: నేను ఎక్కడకు వెళ్లినా, ఎవరిని కలిసినా అదే కనిపిస్తోంది: మోదీ వరుస ట్వీట్లు
- అమెరికా పర్యటన ఫలప్రదమైంది
- ఎక్కడకు వెళ్లినా, ఎవరిని కలిసినా భారత్ పై ఆశావహ దృక్పథం కనిపిస్తోంది
- భారత్ కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సమావేశాలు జరిగాయి
భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగిసింది. తన వారం రోజుల పర్యటనలో భాగంగా 'హౌడీ మోదీ' కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో కూడా ఆయన బిజీబిజీగా గడిపారు. పలు దేశాల అధినేతలు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో భేటీ అయ్యారు. ఐక్యరాజ్యసమితి వేదికగా ఉగ్రవాదం, దానికి సహకరిస్తున్న పాకిస్థాన్ తీరును ఎండగట్టారు. తన పర్యటన ముగిసిన సందర్భంగా మోదీ వరుసగా ట్వీట్లు చేశారు.
'ఈ అమెరికా పర్యటన చాలా ఉత్పాదకమైనది. గత కొన్ని రోజులుగా, నేను విభిన్నశ్రేణి కార్యక్రమాలలో పాల్గొన్నాను. దాని ఫలితాలు మన దేశానికి, మన అభివృద్ధి పథానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. భారతదేశం యొక్క ప్రగతి మన దేశ ప్రకృతి దృశ్యాన్ని ఎలా మార్చింది? మన భూగ్రహం మరింత ప్రశాంతంగా, సంపన్నంగా మరియు సామరస్యంగా ఉండేలా భారతదేశం ఎలా కృషి చేస్తుందనే దానిపై నా ఆలోచనలను ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పంచుకున్నాను.
తోటి ప్రపంచ నాయకులతో అద్భుతమైన ద్వైపాక్షిక చర్చలు జరిపాను. ఆరోగ్య సంరక్షణలో భారతదేశం యొక్క పురోగతి, వాతావరణ మార్పులను తగ్గించడం మరియు మానవాళిని విశ్వసించే వారందరూ ఉగ్రవాదంపై పోరాడటానికి కలిసి రావడం గురించి అభిప్రాయాలను పంచుకున్నాను. సంస్కరణల పథంలో దూసుకుపోతున్న భారత్ కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సమావేశాలు జరిగాయి.
హ్యూస్టన్లో ఇంధన రంగ సీఈవోలతో జరిపిన చర్చలు, న్యూయార్క్ లో పారిశ్రామికవేత్తలతో జరిపిన సమావేశాలు ఫలప్రదమయ్యాయి. భారతదేశంలో అవకాశాలను అన్వేషించడానికి ప్రపంచం ఆసక్తిగా ఉంది. హౌడీ మోదీ కార్యక్రమాన్ని నేను మర్చిపోలేను. ఆ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రావడం మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. భారత్ కు, అమెరికాలో ఉన్న భారతీయ నిపుణులకు ట్రంప్, అమెరికా ఎంతటి ప్రాధాన్యతను ఇస్తోందో ఇది సూచిస్తోంది.
నేను ఎక్కడకు వెళ్లినా, ఎవరిని కలిసినా... వారు ప్రపంచ నాయకులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, సాధారణ ప్రజలు కానీ... వారందరిలో భారత్ పట్ల ఓ ఆశావహ దృక్పథం కనిపించింది. పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ, పేదరికాన్ని నిర్మూలించేందుకు భారత్ చేస్తున్న కృషిని అందరూ అభినందించారు. నన్ను ఎంతో ప్రేమతో స్వాగతించి, ఆదరించి, ఆతిథ్యమిచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అక్కడి ప్రజలు, కాంగ్రెస్ సభ్యులకు ధన్యవాదాలు' అంటూ మోదీ వరుసగా ట్వీట్లు చేశారు.