Andhra Pradesh: నెల రోజుల్లో పదవికి రాజీనామా చేయండి.. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యకు ప్రభుత్వం నోటీసులు
- 2019, ఏప్రిల్ 24తో ముగిసిన వర్ల పదవీకాలం
- ఇంకా ఆ పదవిలో కొనసాగడాన్ని ప్రశ్నించిన ప్రభుత్వం
- ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ పార్ధసారథికి కూడా నోటీసులు
ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్యకు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ చైర్మన్ గా ఆయన పదవీ కాలం ఏప్రిల్ 24, 2019తో ముగిసింది. అయినప్పటికీ, తన పదవికి ఆయన రాజీనామా చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ పదవి నుంచి వైదొలగాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఇందుకు నెల రోజుల గడువు ఇస్తున్నట్టు పేర్కొంది.
ఈ మేరకు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు నిన్న నోటీసు జారీ చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్-8 లోని ఉపనిబంధన-2 ప్రకారం నెల రోజుల గడువు ఇచ్చారు. వర్ల రామయ్యతో పాటు ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ పార్ధసారథిని కూడా తన పదవికి రాజీనామా చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. కాగా, కడప జోనల్ చైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి రాజీనామాను ఆమోదించింది.