Chandrababu: చంద్రబాబుకు ఎంతైనా అత్తని కదా! ఇల్లు కట్టించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా: లక్ష్మీపార్వతి సెటైర్లు
- కరకట్టపై ఉంది నీ ఇల్లా? నువ్వు కట్టావా?
- మీ అమ్మగారు ఏమన్నా రాసిచ్చారా?
- ఆ అక్రమకట్టడంలో వేల కోట్ల డబ్బులు ఏమన్నా దాచిపెట్టావా?
తెలుగులో మంచి సామెత ఉంది ‘ఊరంతా వడ్లు ఎండబెట్టుకుంటే, ఏం చెయ్యాలో తెలియక నక్క తోక ఎండబెట్టుకుందట’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు. తాడేపల్లిలో ఈరోజు మీడియాతో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందని విమర్శించారు.
కరకట్టపై ఉన్న ఇంట్లో చంద్రబాబు నివసించడంపై ఆమె విమర్శలు చేశారు. ‘కరకట్ట మీద ఉన్న నీ ఇల్లు పోతుందా? అది నీ ఇల్లా? నువ్వు కట్టావా? ఎవరిచ్చారో చెప్పు? మీ అమ్మగారు ఏమన్నా రాసిచ్చారా? లేకపోతే మీ నాన్న గారు ఏమన్నా వారసత్వ హక్కుగా తెచ్చి నీ పేరుతో రిజిష్టర్ చేసి పోయారా?’ అని ప్రశ్నించారు. ‘నాకైతే డౌట్ గానే ఉంది. ఆ అక్రమకట్టడంలో నువ్వు(చంద్రబాబు) వేల కోట్ల డబ్బులు ఏమన్నా దాచిపెట్టావా? ఎట్లా అయినా అత్తని కదా! ఆ సానుభూతితో చందాలు వసూలు చేసి నీకు ఇల్లు కట్టించి ఇవ్వమంటే అత్తగా నేను సిద్ధంగా ఉన్నాను.
ఈ సందర్భంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి గురించి ప్రస్తావించారు. చంద్రబాబు, కోడెల బిడ్డల కారణంగానే ఆయన మృతి చెందారని ఆరోపించారు. కోడెలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు నీచమైన కుట్రలకు పాల్పడ్డారని, శవరాజకీయాలు చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటి వరకూ చంద్రబాబు ఒకే రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.